top of page
Suresh D

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. ఐదుగురు దుర్మరణం..


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. హత్నూర మండలం చందాపూర్‌ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి నిమ్స్‌, కేర్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. సంగారెడ్డి జిల్లా చందాపూర్‌ ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌ సమీక్ష జరిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఫైర్‌ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కలెక్టర్‌, ఎస్పీకి సూచించారు రేవంత్‌. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించారు.ఎస్‌బీ ఆర్గానిక్స్‌ యూనిట్‌-1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతోపాటు బాయిలర్‌ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు సమాచారం. ఇటీవలే బాయిలర్‌ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేపట్టి కొనసాగిస్తున్నట్టు తెలిసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

bottom of page