ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు. కొన్నిసార్లు తన మంచి పనులతో.. మరికొన్ని సార్లు కాంట్రవర్సీలతో ఎలాగోలా ఎల్లప్పుడూ వార్తల్లో నిలబడే.. ఈ రౌడీ హీరో పుట్టినరోజు సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..
విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ మొదట్లో కేవలం చిన్న పాత్రలకి మాత్రమే పరిమితమయ్యారు. 2011లో నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ.. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చాలా చిన్న పాత్ర పోషించారు. ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు.
ఆ తరువాత కూడా ఈ హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి.. మెయిన్ హీరోగా అవకాశాలు అందుకోలేకపోయారు. అయినా అలుపెరగకుండా పట్టు వదలని విక్రమార్కుడి లాగా సినిమా అవకాశాల కోసం ఎంతగానో ట్రై చేస్తూ తన కెరీర్ కొనసాగించారు ఈ హీరో..
విజయ్ దేవరకొండ కి 2015 లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో కొంచెం పేరు తెచ్చిపెట్టింది. నాని హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించినా కానీ.. ఆ పాత్రకి ఆ సినిమాలో ప్రాధాన్యత ఉండటంతో విజయ్ దేవరకొండ కి కూడా మంచి పేరు వచ్చింది.
ఇక 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో హీరో అయిపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకి మంచి విజయం తెచ్చి పెట్టడమే.. కాకుండా మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. కాగా 2017 లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది.
బోలెడు వివాదాల మధ్య విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విజయ్ దేవరకొండ రేంజ్ ని విపరీతంగా పెంచేసింది. ఆ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండ కి రౌడీ బాయ్ ట్యాగ్ కూడా చింది. అప్పటినుంచి విజయ్ దేవరకొండ గురించి టాలీవుడ్ లో తెలియనివారు లేరు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు ఈ హీరో. ఇక మళ్ళీ గీతాగోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా విడుదల తరువాత.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం విజయ్ పేరు మారుమోగింది. విజయ్ దేవరకొండ హిందీలో ఎటువంటి సినిమాలో నటించకపోయిన.. అక్కడ హీరోయిన్ సైతం ఈ హీరో తమ ఫేవరెట్ హీరో అంటూ చెప్పసాగారు.
నోటా సినిమా తో తమిళ్లో కూడా అడుగు పెట్టారు కానీ.. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక టాక్సీవాలా సినిమాతో మళ్లీ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈ మధ్య మాత్రం ఈ హీరోకి చెప్పుకోదగిన హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ మీద ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే ఖుషి సినిమాతో మళ్లీ మంచి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్.
ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడేవాడిని అని చెప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రతి సంవత్సరం దేవర శాంతా అనే కాంటెస్ట్ తో తన అభిమానులను కొత్త సంవత్సరం సందర్భంగా గిఫ్ట్లు ఇచ్చి సంతోష పరుస్తూ ఉంటాడు. ఎంత స్టార్ స్టేటస్ ఉన్నా ఇంకా పక్కింటి కుర్రాడిలానే అందరితో మంచిగా ప్రవర్తించే విజయ్ దేవరకొండ ఇవాళ మే 9న తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.