గంపెడు అంచనాలతో వచ్చే కొన్ని చిత్రాలు దారుణంగా విఫలవుతుంటాయి. స్టార్ నటీనటులు, భారీ బడ్జెట్‍తో వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అలాంటి సినిమానే ‘గణపత్’. భారీ అంచనాలతో గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచింది. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్ర పాత్ర పోషించారు. ఈ ‘గణపత్’ సినిమా దారుణంగా ప్లాఫ్ అయింది. ఓటీటీలోకి రాకముందే.. టీవీ ఛానెల్‍లో ప్రసారమైంది. ఈ మూవీ వివరాలు ఇవే..
డిస్టోపియన్ మూవీగా..
గణపత్ సినిమా డిస్టోపియన్ యాక్షన్ మూవీగా వచ్చింది. భవిష్యత్తు అయిన 2070 కాలం బ్యాక్‍డ్రాప్‍తో తెరకెక్కింది. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. విలన్ల నుంచి కష్టాలను ఎదుర్కొనే ప్రజలను కాపాడేందుకు వచ్చే రక్షకుడు గణపత్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు హీరో టైగర్ ష్రాఫ్.
గ్రాఫిక్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో గణపత్ ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. మంచి బజ్ ఏర్పడింది. 2023 అక్టోబర్ 30వ తేదీన మంచి అంచనాలతో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, నెగెటివ్ టాక్‍తో మొదటి షో నుంచే ఢీలా పడింది.
డిజాస్టర్ కలెక్షన్లు
గణపత్ చిత్రం సుమారు రూ.190కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, ఈ మూవీకి ఫుల్ రన్‍లో రూ.15కోట్ల కలెక్షన్లు కూడా రాలేదు. సుమారు రూ.13కోట్ల వసూళ్లే వచ్చాయని అంచనా. ఈ స్థాయిలో అల్ట్రా డిజాస్టర్ అయింది గణపత్. ఈ మూవీని గుడ్‍కో, పూజా ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై వికాస్ బహ్ల్, జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్ సంయుక్తంగా నిర్మించారు.
ఏడు నెలలైనా ఓటీటీలోకి నో
గణపత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల్లో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకుంది. అయితే, ఈ మూవీ ఇప్పటి వరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఏడు నెలలైనా ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఓటీటీ కంటే ముందే టీవీలో..
గణపత్ సినిమా ఓటీటీలో అడుగుపెట్టే ముందే టీవీ ఛానెల్‍లో ప్రసారమైంది. సోనీ మ్యాక్స్ ఛానెల్‍లో ఈ చిత్రం మే 26వ తేదీన టెలికాస్ట్ అయింది. ఇటీవలి కాలంలో ఇలా జరగడం చాలా అరుదే.
గణపత్ చిత్రంలో టైగర్ ష్రాఫ్, కృతి, అమితాబ్‍తో పాటు ఇలీ అవ్రామ్, రహ్మన్, గిరిశ్ కులకర్ణి, శృతి మీనన్ కీలకపాత్రలు పోషించారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అంతటా నెగెటివ్ టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ విషయంలోనూ పేలవంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రం డిజాస్టర్ అయింది. గణపత్ మూవీకి ఏకంగా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోటే మియా కూడా ఈ ఏడాది ఏప్రిల్‍లో రిలీజైన ప్లాఫ్ అయింది. దీంతో టైగర్ ష్రాఫ్‍కు వరుసగా రెండో డిజాస్టర్ ఎదురైంది.