ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన పర్సులో నుంచి రూ. 2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. తన దగ్గర ఉద్యోగ చేస్తున్న ఓ వ్యక్తిని కొట్టి చంపేశాడు యజమాని! ఈ ఘటన స్థానికంగా కలకల సృష్టించింది. ఘజియాబాద్‌లోని తిలా షబాజ్బుర్లో గురువారం మధ్యాహ్నం జరిగింది ఈ షాకింగ్ ఘటన. 22ఏళ్ల పంకజ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. కాగా.. స్థానికంగా ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్లో మెకానిక్‌గా అతను పనిచేస్తున్నాడు.
నిందితుడి పేరు.. అమిత్ కుమార్ మావి. అతని వయస్సు 32ఏళ్లు. కాగా.. మావి పర్సు తన కారులో ఉందని, అందులో సుమారు రూ.2,000 మాయమైనట్లు గుర్తించాడు. డబ్బు మాయమవ్వడం వెనుక పంకజ్ ఉన్నాడని అనుమానించి.. కోపంతో అతడిని తాడుతో కట్టేసి కొట్టడం మొదలుపెట్టాడు మావి. కర్రతో తీవ్రంగా కొట్టడంతో పంకజ్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. కోపం చల్లారిన తర్వాత.. తాను చేసిన గాయాలు తీవ్రంగా ఉన్నాయని గ్రహించిన అమిత్.. గాయపడిన పంకజ్‌ను దిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం బాధితుడు మరణించాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పంకజ్ తండ్రి విజయ్ కుమార్.. లోని బోర్డర్ పోలీసులను ఆశ్రయించారు. యజమానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితుడు అమిత్ మావిపై హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ వర్మ తెలిపారు.ఇది విన్నవారందరు షాక్‌కు గురవుతున్నారు. క్షణికావేశంలో నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా.. నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.