ప్రజంట్ ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. మండే ఎండల నేపథ్యంలో రాత్రుళ్లు గ్రామాల్లో ఆరు బయటే చల్లటి గాలికి చాలామంది పడుకుంటూ ఉంటారు. ఇంటి ముందు మంచి వేపచెట్టు ఉంటే.. దాని నుంచి వచ్చే గాలికి హ్యాపీగా నిద్రిస్తారు. లేదంటే డాబాలపైన పడుకుంటారు. అలాంటివారికే ఈ అలెర్ట్. సమ్మర్ టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాజాగా నల్గొండ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడనుంచి పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు దొంగలు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మోత్కూరుకు చెందిన గడ్డం యాదమ్మ గురువారం ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును దోచుకెళ్లారు. క్షణాల్లో ఆమె మెడలోంచి బంగారాన్ని కొట్టేసి పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే.. ఎండాకాలంలో ఆరు బయట నిద్రించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం వంటి ధరించి బయట పడుకోకపోవటమే బెటర్ అని చెబుతున్నారు. ఇంట్లో కూడా డబ్బు, నగలు వంటివి ఉంచుకోవద్దని సూచిస్తున్నారు. పెద్ద మెుత్తంలో బంగారం, డబ్బులు ఉంటే బ్యాంకుల్లో భద్రంగా పెట్టుకోవాలని అంటున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాలు ఎండాకాలం టార్గెట్‌గా చోరీలకు తెగబడతాయని.. వారు దాడులు కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యకులు కనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.