top of page
MediaFx

గుడ్ న్యూస్.. వారికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు..


ఆరోగ్యశ్రీ పథకంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సూచించారు. తెలంగాణలో అర్హులైన అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి.. ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‎కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.

అటవీ సంపద పెంచడంపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించండని తెలిపారు. పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా చూడాలన్నారు. అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు కోతుల బెడద తగ్గే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీశాఖకు ఉండేలా చూడాలని ఆదేశించారు. కెనాల్స్, చెరువుగట్ల వెంట తాటి, ఈత మొక్కలు నాటేలా చూడాలని చెప్పారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

bottom of page