top of page
MediaFx

జీపీఎస్ గొంతు ఆమెదే!


ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తెలియని ప్రాంతాలకే కాదు.. బంధువుల ఇళ్లు, ఆఫీసుల అడ్రస్లు, దగ్గర్లోని బ్యాంకులూ, ఆసుపత్రులు... సులువుగా ఎక్కడికి వెళ్లాలన్నా దీనిపై ఆధారపడేవారు ఎక్కువే. ఇంతకీ మీ గమ్యానికి దారి చూపించే ఆ శ్రావ్యమైన గొంతు ఎవరిదో తెలుసా? లేదంటే ఇది చదివేయండి...

గూగుల్, ఆపిల్ సిరిలో జీపీఎస్ మార్గాల్ని సూచించే గొంతు... ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ జాకబ్సైని. తను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. గాయని, పాటల రచయిత్రి, ఇన్స్పిరేషనల్ స్పీకర్ కూడా. ఏడేళ్ల వయసులోనే పాటలపై ఆసక్తితో రాయడం ఆరంభించారు. టీవీల్లో వచ్చే జింగిలినిని రాసుకుని అద్భుతంగా పాడేవారు. అందులోనే కెరియర్ నిర్మించుకోవాలని భావించి... 'వాయిస్, పియానో' ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్, పియానో అసోసియేట్గా డిప్లొమా చేశారు. వివిధ రకాల క్రీడా కార్యక్రమాల్లో ఆసీస్ జాతీయ గీతాన్ని ఆలపించి అశేష అభిమాన గణాన్నీ సంపాదించుకున్నారు. వేలకొద్దీ ప్రకటనలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. ఆపై బ్రిటిష్ ఆస్ట్రేలియన్ గాయని ఒలీవియా న్యూటన్ జాన్ స్ఫూర్తితో మరిన్ని అవకాశాలూ, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని భావించి న్యూయార్క్కి మకాం మార్చారు. ఆ తరవాత సొంతంగా 'కర్లీ క్వీన్' పేరుతో ఓ లేబుల్ సృష్టించి పది ఆల్బమ్లు విడుదల చేశారు. అప్పుడే ఓ ఐటీ కంపెనీ నిర్వహించిన వాయిస్ రికార్డింగ్ ఆడిషన్స్లో పాల్గొన్నారు కరెన్. వారికి ఆమె గొంతు నచ్చడంతో టెలిఫోన్ డైరెక్టరీ అంత పుస్తకం ఇచ్చి.. అందులోని సమాచారాన్ని వాయిస్ గా చెప్పమన్నారట. మూడు వారాల పాటు ఆ పని చేసినా... అది ఎందుకో అప్పటికి కరెన్కి తెలియదు. తరవాత కొన్నాళ్లకు ఆ విషయమే మరిచిపోయారట. చాన్నాళ్ల తరవాత ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి జీపీఎస్లో నీ వాయిస్ వస్తోందని చెబితే ఆశ్చర్యపోయారామె. అది తన జీవితాన్నే మలుపు తిప్పిందని చెబుతారు కరెన్. మొదట అది ఆండ్రాయిడ్ ఫోన్లకోసమే అయినా తరవాత యాపిల్ ఫోన్లలో వాడే వాయిస్ యాప్ 'సిరి'లోనూ కరెన్ చెప్పిన ఆడియోని అనుసంధానించారు. టీవీ, రేడియో, అంతర్జాలంలో... తన గొంతుతో మాయాజాలం చేసే కరెన్ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక జాజ్ ప్రైజ్ ఆమెను వరించింది.


bottom of page