top of page

సమస్యల వలయంలో గురుకులాలు..

MediaFx

రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, పనిముట్లు పనిచేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారని వెల్లడించారు. కొన్ని చోట్ల ఐటీఐ తరగతుల్లోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయని తెలిపారు. స్నానాల గదులకు డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. సరిపడా బాత్‌రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, పెడుతున్న భోజనం కూడా నాణ్యంగా ఉండటం లేదన్నారు. దిక్కులేక కారం అన్నంతో కడుపులు నింపుకుంటున్నారని చెప్పారు. వాటర్‌ ట్యాంకులు మురికితో పాకురు పట్టి ఉంటున్నాయని తెలిపారు. ఆ నీటినే విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు వాడుతుండటంతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు.

ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ప్రశ్నించారు. గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన అన్ని సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

bottom of page