ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బర్డ్ ఫ్లూపై కూడా ఓ పరిశోధన జరిగింది. పిట్స్‌బర్గ్‌లో బర్డ్ ఫ్లూపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని పెద్ద ముప్పుగా అభివర్ణించారు. రాబోయే కాలంలో ఈ వ్యాధి భారీ సంఖ్యలో ప్రజలకు సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1 చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఇప్పుడు పక్షులు, జంతువులకు కూడా వ్యాధి సోకుతోంది. ఈ వైరస్ ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే కాలంలో కరోనా కంటే ప్రమాదకరమైన మహమ్మారి రూపం దాల్చవచ్చు. కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బర్డ్ ఫ్లూ గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా విస్తరిస్తున్నందున శాస్త్రవేత్తలు ఈ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోళ్లలో మాత్రమే ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ఆవులు, పిల్లులు, మనుషులు కూడా దీని బారిన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అమెరికాలో కోళ్లు, 337,000 కోడిపిల్లల్లో ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అమెరికాలో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా ఆవులు చనిపోతున్న కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న వ్యక్తికి హెచ్5ఎన్1 వైరస్ సోకినట్లు తేలింది. ఈ కారణంగానే శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయగా.. బర్డ్ ఫ్లూ వైరస్ లో అనేక రకాల మ్యుటేషన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇంతలో బర్డ్ ఫ్లూ కోవిడ్ కంటే పెను ముప్పుగా మారుతుందా.. భారతదేశంలో కొత్త అంటువ్యాధి రూపాన్ని తీసుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.