యూపీ సీఎం యోగిని మర్యాద పూర్వకంగా కలిసిన హనుమాన్ చిత్ర బృందం..🎥✨
- Suresh D
- Jan 25, 2024
- 2 min read
హనుమాన్ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.🎥✨
హనుమాన్ ఈ పేరే ఓ బ్రాండ్. అందరి సూపర్ హీరోలకు ఈయనే ఇన్‌స్ప్రేషన్. ఈ మూవీ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఉత్తర భారత దేశంలో కూడా ఈ మూవీ మంచి వసూళ్లనే రాబడుతోంది. అంతేకాదు నేటితో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 2 వారాల రన్ పూర్తి చేసుకోబోతుంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులైన దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma), హీరో తేజ సజ్జా (Teja Sajja), నిర్మాత నిరంజన్ రెడ్డి మన దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. హనుమాన్ సినిమాపై యోగి ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలిపారు. మన ఇతిహాసాలకు సంబంధించిన కథలను మరిన్ని తెరకెక్కించమని మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ సందర్బంగా మన ఇతిహాసాల్లో అంశాలతోనే సూపర్ హీరో కాన్సెప్ట్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగిని తమకు కలిసే అవకాశం ఇవ్వడం తమ టీమ్ అదృష్టమన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయనకు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం మరవలేనిదన్నారు. అయోధ్యలో బాలరాముడు కొలువైన ఈ సందర్భంగా మా హనుమాన్ సినిమా విడుదల కావడం.. అదే సమయంలో యూపీ సీఎంను కలవడం తమకు దక్కిన భాగ్యమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కథలతో ఆడియన్స్‌ను అలరిస్తానే విషయాన్ని ప్రస్తావించారు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ సినిమా విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా హనుమాన్ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో టాలీవుడ్‌లోనే.. మన దేశంలోనే తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది హనుమాన్ మూవీ.
సంక్రాంతి గట్టిపోటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'గుంటూరు కారం" సినిమా ఉన్న ఆ సినిమాతో పోటీని తట్టుకొని నిలబడింది హనుమాన్. తొలి రోజు ముందు నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రారంభమైన హనుమాన్ దూకుడు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 125 కోట్ల షేర్.. (రూ.230 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యూఎస్ (అమెరికా) బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ $4.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ. 90 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.🎥✨