ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య జరిగి ఏడాది అయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో నివాళి అర్పించడం గమనార్హం. కెనడా తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. 39 ఏళ్ల కిందట కెనడాలో ఎయిరిండియా కనిష్క విమానాన్ని పేల్చిన ఘటనతో వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం బదులిచ్చింది. ఈ ఘటనలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 23 నాటికి 39 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సంతాప కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
‘‘తీవ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తోంది. 1985లో ఎయిరిండియాకు చెందిన కనిష్క విమానాన్ని పేల్చివేసిన ఘటనకు 39 ఏళ్లు.. ఆ ఉగ్రవాదుల పిరికిపంద చర్యలో 86 మంది చిన్నారులు సహా 329 మంది అమాయకులు బలయ్యారు.. ఈ దుర్ఘటనకు సంతాపంగా జూన్ 23న వాంకోవర్ స్టాన్లీ పార్క్‌లో సంతాప కార్యక్రమం నిర్వహించనున్నాం.. భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం’’ అని ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది.
గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వద్ద నిజ్జర్ హత్య జరిగింది. భారత ఏజెంట్లు ఉన్నారంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్ ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరింది. ప్రధాని మోదీతో ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రూడో భేటీ అయిన కొద్ది రోజులకే నిజ్జర్‌కు కెనడా నివాళి అర్పించడం చర్చనీయాంశం.