top of page
MediaFx

హార్దిక్ కాదు..గిల్, పంత్‌లకు నో ఛాన్స్..


రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ లిస్టులో ఇప్పుడు మరొక పేరు వినిపిస్తోంది. అదే టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. దీనికి తగ్గట్టుగానే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఉండాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఎంపికని గౌతీ భావిస్తున్నాడు. ఈ మేరకు టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయాల్సిందిగా సెలక్షన్ కమిటీకి గంభీర్ సూచించినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలు.

హార్దిక్ ఫిట్ నెస్ సమస్యలే ప్రధాన కారణం..

హార్దిక్ పాండ్యా తరచూ గాయలపాలవుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ దీనికి నిదర్శనం. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పాండ్యా వన్డే ప్రపంచకప్‌ మధ్యలోనే ఆడాడు. దీని తర్వాత అతను నేరుగా టీ20 ప్రపంచకప్‌లో ఆడడం గమనార్హం. అందుకే, పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ సెలక్షన్ కమిటీని అభ్యర్థించాడు. ఈ అభ్యర్థన మేరకు ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి రావడంతో అతడికి కెప్టెన్ గా పట్టం కట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా కనిపించాడు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీ మధ్య సూర్య 7 టీ20 మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. సూర్య సారథ్యంలో భారత్ 5 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. గౌతీ డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే టీమిండియా 20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.


bottom of page