భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు ఆ విమానాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా ఎయిర్ బేస్ నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బిహార్, జార్ఖండ్ మీదుగా మన యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి.
షేక్ హసీనా యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు.. ఆమె ఉన్న విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాయి. ఆ విమానంలోని సిబ్బందితో భారత్ దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాలన్నింటినీ ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, జనరల్ ఉపేంద్ర ద్వివేది.. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. మరోవైపు అదే సమయంలో భద్రతాదళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు, జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
హసీనా విమానం హిండన్ ఎయిర్ బేస్‌లో సాయంత్రం సుమారు 5 గంటల 45 నిమిషాలకు దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోవల్ ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లి ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన థోవల్ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి పరిస్థితిని వివరించారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు మారిపోతున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సి-130 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించి భారత్‌లో అడుగుపెట్టారు. ఇండియా నుంచి నేరుగా ఆమె లండన్ వెళ్లనున్నారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. హింస చెలరేగడంతో ఆమె ఢాకాలోని అధికారిక నివాసాన్ని ఖాళ్లీ చేశారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియరాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.