top of page
MediaFx

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు.. కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. ఇటు తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నారాయణపురం వాగులో 25మంది కూలీలు చిక్కుకుపోయారు. 2 హెలికాప్టర్లతో రంగంలోకి దిగిన NDRF సిబ్బంది కూలీలను రక్షించారు. ఎడపల్లి వాగు పొంగడంతో మహదేవపూర్ కాళేశ్వరం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మహాదేవపూర్ మండలంలో చండ్రపల్లి వాగు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. ములుగు జిల్లాలో బొగత జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో జలపాతం సందర్శనకు ఎవరినీ అనుమతించడం లేదు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో 52 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది. క ములుగు ఏజెన్సీలో 20 కుటుంబాల ప్రాణాలు కాపాడడం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది. DMHO అప్పయ్యతో కలిసి వైద్య బృందమంతా 15 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి, జ్వరాలతో మంచం పట్టిన గిరిజనులకు వైద్యం చేశారు. ఇక ఏపీలో కూడా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు రాజమండ్రిలో దేవీ చౌక్ నీట మునిగింది. దేవీపట్నం గండి పోచమ్మ దేవస్థానం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పాపికొండ బోట్‌ షికారుకు బ్రేకులు పడ్డాయి. వరద నీరు ముంచెత్తడంతో కోరుకొండ – రాజమండ్రి మధ్య రాకపోకలు బందయ్యాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేని వానలతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్నవరంలో కొండవాగు ఉధృతికి 15 గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి దగ్గర 50మంది భక్తులు వరదలో చిక్కుకున్నారు. అయితే ఆలయ కమిటీ వారిని సురక్షిత ప్రదేశానికి తరలించింది. ద్వారకా తిరుమలలో వర్షంలో తడుస్తూనే చిన వెంకన్నను దర్శించుకున్నారు భక్తులు.

bottom of page