top of page
MediaFx

కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం..

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. హరహర శంభోశంకర నినాదాలతో కేదార్‌నాథ్ వైపు భక్తులు బారులు తీరుతున్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున గాంధీ సరోవర్ కొండలపై నుంచి హితపాతం దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కేదార్‌నాథ్‌లోని గాంధీ సరోవర్‌పై హిమపాతం సంభవించినట్లు రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే తెలిపారు. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని చెప్పారు. కేదార్‌నాథ్‌లో ఈ హిమపాతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆలయం వెనుక ఉన్న పర్వతంపై అకస్మాత్తుగా హిమపాతం సంభవించినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. హిమపాతంలో కూలిన మంచు అధిక వేగంతో దూసుకొచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. అయితే, ఆలయం వెనుక గాంధీ సరోవర్ కారణంగా, హిమపాతం అక్కడ ఆగిపోయింది. ముందుకు కదలలేదు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఆలయం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంది.కాగా, కేదార్‌నాథ్‌ ఆలయం వెనుక ఉన్న గాంధీ సరోవర్ కొండలపై నుంచి హిమపాతం జారిపడటం చూసి భక్తులు, స్థానికులు ఆందోళన చెందారు. అయితే ఈ పర్వతంపై హిమపాతాలు సంభవించడం అసాధారణం కాదని విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ తెలిపారు. ఈ పర్వతంపై అప్పుడప్పుడు ఇలాంటి హిమపాతాలు జారుతుంటాయని చెప్పారు. కొండలపై బాగా మంచు పేరుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ హిమపాతాలు ఎలాంటి నష్టం కలిగించవని వెల్లడించారు. మరోవైపు కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం దూసుకొచ్చిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


bottom of page