హీరో ధనుష్ విషయంలో కోలీవుడ్ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఈ ఇష్యూ చిన్నదేమీ కాదు. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే.. ధనుష్ తో ఎవరైనా సినిమా తీయాలంటే.. కచ్చితంగా నిర్మాతల మండలిని సంప్రదించి ఓకే చెప్పించుకోవాలి. ధనుష్ ఏమీ చిన్న నటుడు కాదు. కోలీవుడ్ లో పెద్ద హీరో. మరెందుకు ఆయనపై అలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక అడ్వాన్స్ ల విషయంలోనూ ఘాటుగానే డిసైడైంది. అడ్వాన్సులు ఇచ్చే సంస్కృతికి కూడా చెక్ పెట్టింది. ఒక సినిమా పూర్తయిన తరువాత మాత్రమే.. మరో సినిమాకు కాల్షీట్లు ఇవ్వాలంది. పైగా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాలు ఏవీ ప్రారంభం కావని తేల్చేసింది. అక్టోబర్ లోపు పాత సినిమాలను పూర్తి చేయాలని చెప్పింది. ఇవేమీ మామూలు నిర్ణయాలు కావు. కోలీవుడ్ లో 24 క్రాఫ్ట్స్ ను, వాటి మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలను ప్రభావితం చేసేవి. మరెందుకు ఫిలిం ఫెడరేషన్ కు కూడా సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది?
ఇంతకీ ధనుష్ విషయంలో తమిళ సినీ నిర్మాతల మండలి ఎందుకింత పట్టుదలగా ఉంది? ఎందుకు ఆయనకు రెడ్ కార్డ్ ఇచ్చింది? దీనికి నిర్మాతలు చెబుతున్న సమాధానం.. ధనుష్.. సినిమాలకు కమిట్ అయ్యేప్పుడు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు తీసుకుంటాడు. కానీ ఆ తరువాత షూటింగ్స్ కు సహకరించడు. ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా.. నిర్మాతల మండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందా? అందుకే ఈ నిర్ణయాలపై నడిగర్ సంఘం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోందా? నిజానికి ధనుష్ ను పిలవకుండా.. ఆయనతో మాట్లాడకుండా ఇలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని నడిగర్ సంఘం అడిగిన ప్రశ్నకు అటువైపు నుంచి సమాధానం లేదు. ఈ విషయంలో నడిగర్ సంఘం.. ధనుష్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆమధ్య హీరో విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి అన్నట్టుగా యుద్ధం సాగింది. ఇటు నడిగర్ సంఘం కూడా దీనిపై ఘాటుగానే స్పందించింది. అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది.
ఎలాంటి కంప్లయింట్ లేకుండా ధనుష్, విశాల్ పై ఇలా ఎలా చర్యలు తీసుకుంటారు అన్నది నడిగర్ సంఘం ప్రశ్న. అక్టోబర్ 30లోపు పెండింగ్ సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేయాలన్న తీర్మానాల గురించి తమకు ఎందుకు చెప్పలేదని నడిగర్ సంఘం ప్రశ్నిస్తోంది. సినీ పరిశ్రమ అంటే వేలాది మంది కార్మికులతో ఉంటుంది. 24 క్రాఫ్టులు దీనిపై ఆధారపడి ఉంటాయి. నిర్ణయాలలో తప్పుంటే.. అది మొత్తం ఇండస్ట్రీపై ప్రభావం చూపించే అవకాశముంటుంది. అలాంటప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే.. దానికి ఎవరు బాధ్యులన్నది నడిగర్ సంఘం ప్రశ్న. నడిగర్ సంఘం వాదన ఇలా ఉన్నా.. తమిళనాట.. నిర్మాతల మండలి తీర్మానాలను ఆమోదించిన వాటిలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంటే నిర్మాతల మండలి నిర్ణయాలు వాటికి ఆమోదమే. మరిప్పుడు నడిగర్ సంఘం ఏం చేయబోతోంది? ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఏం తేల్చబోతోంది? ధనుష్ అంశాన్ని రెండు పక్షాలు ఎందుకు సీరియస్ గా తీసుకున్నాయి?
మామూలుగా అయితే యాక్టర్ పైన లేదా ప్రొడ్యూసర్ పైన కంప్లయింట్ వస్తే.. అప్పుడు నిర్మాతల మండలి, నడిగర్ సంఘం దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తాయి. మరి ధనుష్, విశాల్ విషయంలో ఇది ఎందుకు జరగలేదు? అటు తమిళ సినీ నిర్మాతల మండలి మాత్రం.. నవంబర్ 1 నుంచి షూటింగ్ లను బంద్ చేస్తున్నట్టు ప్రకటించేసింది. దీంతోపాటు సినిమాకు సంబంధం ఉన్న అన్ని పనులూ ఆగిపోతాయి. మరి ఈ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న కార్మికుల పరిస్థితి ఏమిటి? ఇది దేశంలో ఇతర చిత్ర పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. దీనిపై టాలీవుడ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?