‘సింగిల్ హ్యాండ్’తో హీరో నవీన్ కష్టాలు..
- MediaFx
- Aug 3, 2024
- 1 min read
జాతిరత్నాలు సినిమాతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు హీరో నవీన్ పొలిశెట్టి. అంతుకు ముందు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన నవీన్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మధ్యన అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ఆడియెన్స్ కు కన్నీళ్లు తెప్పించాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఈ ట్యాలెంటెడ్ హీరోకు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. ఒక ప్రమాదంలో కుడి కాలు, చేయి ఫ్రాక్చర్ కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగులకు విరామం ఇచ్చేశాడు. ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ప్రమాదంలో చేయి బాగా దెబ్బతినడంతో సరిగ్గా ఏ పనీ చేసుకోలేకపోతున్నాడు. అయితే ఇంత బాధలోనూ తన అభిమానులను నవ్వించాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ మేరకు ఫ్రాక్చర్ తర్వాత జీవితం ఇలా ఉందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఇందులో టీవీ చూస్తోన్న నవీన్ కు హీరో వెంకటేశ్.. ‘ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్’ అని చెప్తున్న డైలాగ్ వస్తుంది. ఇది చూడగానే నవీన్ తన చేయి చూసుకుంటాడు. వెంటనే ఛానల్ మార్చేశాడు. అక్కడ కూడా ‘చేయి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో’ అని గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ వచ్చింది. దీంతో చేయి మీద డైలాగ్స్ వచ్చే ఛానల్స్ వద్దురా బాబోయ్ అని స్పోర్ట్స్ ఛానల్ పెడతాడు. అక్కడ అంపైర్ రెండు చేతులు పైకెత్తుతూ సిక్స్ అని చూపించాడు. ‘ఇదేం గోలరా బాబూ అనుకుంటుంటే ‘గానకోకిలకు చప్పట్లు’ అన్న డైలాగ్ వినిపిస్తుంది. కట్టుతో ఉన్న చేయితో చప్పట్లు కొట్టలేక ఎడమ చేతితో తన చెంపలు వాయించుకుంటాడు హీరో నవీన్. ఇక ఆఖరులో ఫుడ్ కూడా తినడానికి చాలా అవస్థలు పడ్డాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎడమ చేత్తో భోజనం తింటుంటే.. ‘ఎవరైనా ఎడమ చేత్తో భోజనం తింటారా? ఇదేనా సంస్కారం? అన్న డైలాగ్ రాగానే వెంటనే పక్కనే ఉన్న శునకంలా కేవలం నోరు, నాలుకను ప్లేటుకు ఆనిస్తూ తింటాడు’. ఇలా వీడియో మొత్తం తన సింగిల్ హ్యాండ్ తో కష్టాలు పడుతూనే తన అభిమానులకు కావలసిన వినోదాన్ని అందించాడు నవీన్.