top of page
MediaFx

కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు..ఎందుకు!


సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి మరియు లగిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా దాఖలు చేశారు.

పిటిషనర్లు కేటీఆర్ నామినేషన్ సమయంలో వాస్తవాలు వెల్లడించలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ తన అఫిడవిట్లో తనపై భార్య, మైనర్ కుమార్తెలే ఆధారపడ్డారని చెప్పారు. కానీ, కేటీఆర్ కుమారుడు హిమాన్షు గత ఏడాది జులైలో మేజర్ అయ్యారని, అతను తనపై ఆధారపడలేదని పేర్కొన్నారు. హిమాన్షు సిద్దిపేటలో నాలుగు ఎకరాలు, ఎర్రబల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో చెల్లించారని, కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా హిమాన్షు ఆ డబ్బు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.

ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాలు చెప్పకుండా ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 123కు విరుద్ధమని, రుక్మిణి మాదగౌడ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని వివరించారు. కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారిని నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేశారు.

bottom of page