top of page
MediaFx

హిందీ బిగ్ బాస్ విజేతగా టాలీవుడ్ హీరోయిన్..


హిందీ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరిస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కు ఎండ్ కార్డ్ పడింది. జూన్‌ 21న ప్రారంభమైన కొత్త సీజన్‌ ఆగస్టు 2న ఫైనల్‌తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బూల్ బిగ్ బాస్ ఓటీట సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ నేజీ రన్నరప్‌గా నిలిచాడు. వీరితో పాటు కృతికా మాలిక్, రణవీర్ షోరే, సాయి కేతన్ రావ్ టాప్-5 లో నిలిచారు. అయితే సీజన్ అంతటా తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది సనా మక్బూల్. దీనికి తోడు ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీ ఈ అందాల తారనే వరించింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ అనిల్ కపూర్ సనా మక్బుల్ కు రూ. 25 లక్షల చెక్‌ను అందించారు. దీంతో పాటు ఆమెపై బహుమతుల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ మొదటి రెండు సీజన్లకు కరణ్‌జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్‌కు మాత్రం బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ వ్యాఖ్యతగా వ్యవహరించారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3‌లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టడంతో ఈ రియాలిటీ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక విజేత సనా మక్బూల్ విషయానికి వస్తే.. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో కెరీర్ ఆరంభించింది. పలు బాలీవుడ్ సీరియల్స్ లో మెరిసింది. అన్నట్లు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అందాల తార పరిచయమే. 2014లో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన దిక్కలు చూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా మక్బూల్. అలాగే 2017లో రిలీజైన మామా ఓ చందమామ మూవీలోనూ కథానాయికగా కనిపించింది. కొన్ని తమిళ సినిమాల్లోనూ తళుక్కుమందీ ముంబై ముద్దుగుమ్మ.




bottom of page