ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇది ఎవరూ ఊహించని పరిణామం. విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడే.. వాటిని కౌంటర్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. కానీ ఈలోపే ఈడీ అధికారులే నేరుగా హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వచ్చేశారు.
కొద్దిసేపు విచారించి, శుక్రవారం సాయంత్రం 5.20కి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సమయంలోనే ఈడీ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కవితపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని సుప్రీంకోర్టుకు స్పష్టంగా చెప్పింది ఈడీ. అదే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ, ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్ టేకింగ్‌ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. అండర్ టేకింగ్ అంటే.. కవితపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోము అని చెప్పడమే..! అయితే, ఈడీ ఇచ్చిన అండర్ టేకింగ్‌ను వెనక్కి తీసుకోడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు అనేది సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్‌రావు వాదన. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లాయర్ మోహిత్‌రావు ఎమ్మెల్సీ కవితకు లేఖ కూడా పంపారు. కానీ ఆ లెటర్ కవితకు చేరే దానికంటే ముందే ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చేశారు. ఢిల్లీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌తో వచ్చిన ఈడీ అధికారులు.. అనుకున్న ప్లాన్‌లో భాగంగానే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ కవిత అరెస్ట్‌కు కొన్ని గంటల ముందే విచారణకు వచ్చింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. శుక్రవారం నాడు ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగానే.. ఈడీ అధికారులు కవిత నివాసానాకి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టారు. కవిత ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే, తనపై లీగల్ యాక్షన్ తీసుకోడానికి ఈడీ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని ఓవైపు వాదిస్తున్నప్పటికీ, అరెస్ట్ వారెంట్‌తోనే వచ్చామంటూ కవితకు వివరించారు అధికారులు. తాము కవితను అరెస్ట్ చేస్తున్నామని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అరెస్ట్ చేసిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశామనిని కుటుంబ సభ్యులకు వివరించారు. అంటే.. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందన్న సంగతి తెలిసీ, కవితను విచారించడానికి కోర్టు ద్వారా ప్రొసీజర్‌తో దిగారు ఈడీ అధికారులు.