మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడ కూలి ఏకంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది. శిథిలాల కింద ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4), తిరుపతిరావు (20), శంకర్ (22), రాజు (25), ఖుషిగా గుర్తించారు.
కాగా గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా మృతులంతా రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. కార్మికులు ఉంటున్న షెడ్‌పై రిటైనింగ్ వాల్ కూలి పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. కాగా హరిజన్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్స్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.