top of page
MediaFx

హైదరాబాద్‌ పోలీసుల నిర్ణయం వివాదానికి దారితీసింది


హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి కోపం తెప్పించింది. నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఓన్లీ లాఠీఛార్జ్ అంటూ పోలీసులు చేసిన అనౌన్స్‌మెంట్‌పై రచ్చ రాజుకుంది. రాత్రి వేళల్లో జరుగుతున్న నేరాల అదుపు కోసం పోలీసులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పాతబస్తీలో పోలీసులు చేస్తోన్న ఈ అనౌన్స్‌మెంట్‌పై ఒక రేంజ్‌లో మండిపడ్డారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. హైదరాబాద్‌ ఖాకీల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అనౌన్స్‌మెంట్‌ను జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో చేయగలరా అంటూ ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్‌ వర్తిస్తుందనే సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. అసలిది మెట్రో సిటీనా.. లేక పల్లెటూరా అన్నట్టుగా ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా షాపులు తెరిచే ఉంటాయి.

హైదరాబాద్‌లో మాత్రం ఎందుకు తెరిచి ఉంచకూడదో చెప్పాలంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా నిలదీశారు అసదుద్దీన్‌. అయితే, అసదుద్దీన్‌ ఒవైసీపై పోస్ట్‌పై స్పందించారు హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగం. పాతబస్తీలో రాత్రి 11 గంటలకే షాపులు మూసివేయిస్తున్నారన్న వార్తలను ఖండించింది. అసదుద్దీన్‌కు కౌంటర్‌ ఇస్తూనే.. ప్రస్తుతమున్న నిబంధనలనే అమలు చేస్తున్నామంటూ వివరణ ఇచ్చారు పోలీస్‌ ఉన్నతాధికారులు. తామేమీ కొత్త రూల్స్‌ ఏమీ తీసుకురాలేదని సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహ మెహ్రా చెప్పారు. ఎప్పుడు వ్యాపార సముదాయాలు ఓపెన్‌ చేయాలో, మూసివేయాలో పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామని తెలిపారు. అనేక సార్లు యాజమాన్యాలను హెచ్చరించాం, పోలీసులకు సహకరించకోపోతే సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు డీసీపీ స్నేహ మెహ్రా.

అయితే పోలీస్ శాఖ వార్నింగ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నగరంలో దుకాణాలన్ని రాత్రి పదిన్నర లేదా 11 గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్దమంటూ.. హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుకాణాలు, సంస్థలు తెరిచే, మూసేసే సమయాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని.. ఇది అందరూ గమనించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.



bottom of page