ఇటీవల స్నేహితురాలి ఇంట్లో బంగారం కొట్టేసి గోవాకు చెక్కేసిన హీరోయిన్ సౌమ్య శెట్టి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తాను బంగారం దొంగతనం చేయలేదని, తనను పావుగా వాడుకొని కావాలని తనను దొంగతనం కేసులో ఇరికించారని తెలిపింది.
ఈ క్రమంలో తనను, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తన మొబైల్ కూడా తీసేసుకున్నారని, తనను మీడియా ముందుకు రాకుండా చేశారని వివరించింది. తనపై పోలీసులు సైతం అసత్య ఆరోపణలు మోపారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మౌనిక తనకు బంగారం ఇచ్చి తనను ట్రాప్ చేసిందని తెలిపారు. తనను ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, మౌనికకు సంబంధించిన అసభ్యకర ఫోటోలతో బెదిరిస్తున్నారని మౌనిక చెప్పిందని, ఈ క్రమంలోనే తనకు బంగారం ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పిందని సౌమ్య వివరించింది. తనపై చోరీ కేసు బనాయించకముందే తాను తన భర్తతో కలిసి గోవాకు వెళ్లానని సౌమ్య తెలిపింది. వైజాగ్‌కు చెందిన సౌమ్య శెట్టికి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. చిన్న చిన్న సినిమాల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వచ్చాయి. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలోనే వైజాగ్‌లోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ నెంబర్ 102లో పోస్టల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు తన కూతురు మౌనికతో ఆమెకు పరిచయం ఏర్పడింది. మౌనిక కూడా రీల్స్ చేస్తుంటుంది. అయితే, ప్రసాద్ కుమార్తెతో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. తనను తాను ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసిన సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఒక రోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. అప్పటినుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది. పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు కనిపించకపోయే సరికి ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌమ్య శెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సౌమ్య శెట్టి గోవాలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే సౌమ్య మాత్రం తాను రిమాండ్‌లో లేనని చెబుతోంది.