వేసవిలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చి నుంచే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఇక, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయన్న వాతావరణ శాఖ అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం డైపోల్, లానినా పరిస్థితులు ఒకే సమయంలో చురుకుగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్న రుతు పవనాలు పసిఫిక్‌లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయని అంటున్నారు.