తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. ఈ బుల్లితెర రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 1) బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో 8 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో హీరోయిన్ల డ్యాన్సు పర్ఫామెన్స్ లు, సెలబ్రిటీల ఎంట్రీలు, వారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. గత సీజన ్లాగే ఈసారి బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌస్‌లోకి సుమారుగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని సమాచారం. ఇక వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను నాలుగు లేదా ఐదో వారంలో హౌస్‌లోకి పంపిస్తారట. ప్రధాన కంటెస్టెంట్స్ గా హీరో ఆదిత్య ఓం, యాంకర్ విష్ణుప్రియ, యష్మీ గౌడ, నిఖిల్, ఆర్జే శేఖర్ బాషా, రీతూ చౌదరి, సోనియా ఆకుల, సోనియా సింగ్, నైనిక, బెజవాడ బేబక్క , పరమేశ్వర్ హివ్రాలే, రాకింగ్ రాకేష్, న్యూస్ రీడర్ కల్యాణ్, మోడల్ రవితేజ, విస్మయ శ్రీ, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్, ఖయ్యూమ్ అలీ, సౌమ్యరావు, అంజలి పవన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ గా కూడా ఎంట్రీ ఇవ్వచ్చని సమచారం. బిగ్ బాస్ సీజన్ ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమోలు బజ్ క్రియేట్ చేశాయి. ‘అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్ లిమిటెడ్..లిమిటే లేదు’ నాగార్జున బిగ్ బాస్ ఆడియెన్స్ కు మాట కూడా ఇచ్చేశాడు. మరీ ఆ రేంజ్ లో కొత్త సీజన్ ఉంటుందా? కంటెస్టెంట్స్ అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. బిగ్ బాస్ షో ను స్టార్ మా ఛానెల్ లో చూడొచ్చు. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంటుంది.