భారత కోటీశ్వరులు వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన వారు, భారతదేశాన్ని విడిచిపెడుతున్నారు. 2024లో దాదాపు 4,300 మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్ళనున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్టు పేర్కొంది. మిలియనీర్ల వలసలలో భారత్ మూడో స్థానంలో ఉంది.
గత ఏడాది దాదాపు 5,100 భారతీయ కోటీశ్వరులు విదేశాలకు వలస వెళ్లారు. వీరిలో అధికంగా యూఏఈకి వలస వెళ్ళారు. 2024లో మొత్తం 6,800 మంది మిలియనీర్లు యూఏఈకి వలస వెళ్ళే అవకాశం ఉంది. యూఏఈ తరువాత అమెరికా, సింగపూర్ లో కూడా ఎక్కువమంది వలస వెళ్ళుతున్నారు.
2013 నుండి 2023 మధ్యకాలంలో యూఏఈలో భారతీయ మిలియనీర్లు 85% పెరిగారు. ప్రస్తుతం భారతదేశంలో 3,26,400 హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ (అధిక నికర విలువ గల వ్యక్తులు) ఉన్నారు. చైనాలో 8,62,400 హెచ్‌ఎన్‌డబ్ల్యుఐలు ఉండగా, భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది.
వలసలకు కారణాలేంటి? దేశంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనల పట్ల విసుగెత్తి, భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపారావకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకుని ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.