భారత నావికాదళం మరో సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి భారత నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 12 గంటల సుదీర్ఘ యాంటీ పైరసీ ఆపరేషన్‌లో హైజాక్ అయిన ఇరాన్ ఫిషింగ్ నౌకతో సహా 23 మంది పాకిస్తానీ పౌరులను రక్షించింది. అరేబియా సముద్రంలో ఇరాన్ ఫిషింగ్ ఓడ అల్-కాన్బర్‌పై సాయుధ వ్యక్తులు జరిపిన దాడిని విఫలం చేసిన భారత నౌకాదళం 23 మంది పాకిస్థానీలను రక్షించింది. శుక్రవారం, మార్చి 28 సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా వెళుతున్న ఇరాన్ నౌకను తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, భారత నావికాదళం చురుకుగా వ్యవహారించింది. హైజాక్ చేసిన ఓడను విడిపించడానికి గైడెడ్ క్షిపణులతో కూడిన రెండు యుద్ధనౌకలను – ANS సుమేధ , INS త్రిశూల్‌లను భారత నావికా దళం పంపింది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు కార్గో షిప్‌లపై దాడులను దృష్టిలో ఉంచుకుని రెండు యుద్ధనౌకలను ఆ ప్రాంతంలో మోహరించారు. కొన్ని గంటల్లోనే, హైజాక్ చేసిన ఓడ సమీపంలోకి చేరుకున్న తర్వాత భారత్ నేవీ తన చర్యను ప్రారంభించింది.
హిందూ మహాసముద్రంలోని యెమెన్ ద్వీపం – సోకోట్రాకు నైరుతి దిశలో సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక ఉన్నట్లు నేవీ అధికారులు గుర్తించారు. తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు అందులో నక్కి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. హైజాక్ చేసిన ఓడను అడ్డుకోవడం ద్వారా హైజాకర్లకు వార్నింగ్ ఇచ్చి మార్కోస్ కమాండోలను దింపారు. చిన్నపాటి ప్రతిఘటన తర్వాత, హైజాక్ చేసిన తొమ్మిది మంది బందిపోట్లు కమాండోల ముందు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు భారత్ నేవీ అధికారులు.