గిల్, జురేల్ వీరోచిత ఇన్నింగ్స్.. టెన్షన్ పెట్టి గెలిచిన భారత్.. సిరీస్ గెలిచిన రోహిత్ సేన..🏏💫
- Suresh D
- Feb 26, 2024
- 1 min read
ఇంగ్లండ్‍పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను సొంతం చేసుకుంది. శుభ్‍మన్ గిల్ అర్ధ శతకంతో అదరగొట్టాడు.
రాంచీ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజైన సోమవారం 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని కూడా కైవసం చేసుకున్న టీమిండియా సిరీస్‌లో 3-1తో ముందంజలో ఉంది. టామ్ హార్ట్లీ వేసిన బంతికి ధృవ్ జురెల్ రెండు పరుగులు చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. భారత్ తరపున కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్ గిల్ (52) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో రాణించారు. 40/0 స్కోరుతో నాలుగో రోజు టీమ్ ఇండియా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది.
భారత్ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలు సాధించారు. గిల్ 52 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. అతనితో పాటు, ధృవ్ జురెల్ కూడా కష్ట సమయాల్లో 39 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కూడా అజేయంగా వెనుదిరిగాడు. దీంతో వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించిన రోహిత్ సేన.. మ్యాచ్‌ను మాత్రమే కాకుండా.. 3-1 తేడాతో గెలుచుకుంది. కాగా, నాలుగో రోజు భారత్ నిన్నటి స్కోరు 40/0తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 84 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. జో రూట్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అందించిన క్యాచ్‌ను జేమ్స్ అండర్సన్ అద్భుతంగా పట్టాడు. 37 పరుగుల వద్ద యశస్వి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 17వ అర్ధ సెంచరీ నమోదు చేసి ఔట్ కాగా.. అతని వికెట్ టోర్మ్ హాట్లీ చేతికి చిక్కింది. రోహిత్ 55 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు. రజత్ పాటిదార్ మళ్లీ విఫలమై ఖాతా కూడా తెరవలేకపోయాడు.
అనంతరం లంచ్ తర్వాత భారత్‌కు వరుసగా రెండు బంతుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. షోయబ్ బషీర్ మొదట రవీంద్ర జడేజాను అవుట్ చేసి, తర్వాతి బంతికే సర్ఫరాజ్ ఖాన్‌ను అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద జడేజా ఔటయ్యాడు. అదే సమయంలో సర్ఫరాజ్ ఖాతా కూడా తెరవలేదు. అనంతరం ధృవ్ జురెల్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా మ్యాచ్‌ను తనవైపునకు తిప్పుకుంది. దీంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.🏏💫