top of page

భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం


భారత్‌తో బంగ్లాదేశ్‌ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ మహమ్మద్‌ యూనస్‌ తెలిపారు. ఇటీవలే ఆ దేశంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో యూనస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యూనస్‌ ఈ విధంగా స్పందించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎస్‌ వార్తా సంస్థ నివేదించింది. ‘మేం భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నాం. అయితే అవి కచ్చితంగా సమానత్వం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని యూనస్‌ నొక్కి చెప్పినట్లుగా ఆయన సహాయకుడు మహ్ఫుజ్‌ ఆలంని ఊటంకిస్తూ బీఎస్‌ఎస్‌ నివేదించింది. పొరుగు దేశాలతో సంబంధాలకు బంగ్లాదేశ్‌ పరస్పర గౌరవం ఇస్తుందన్నారు. సార్క్ (సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ రీజనల్‌ కోపరేషన్‌)ను పునరుద్ధరించాలని యూనస్‌ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు.

మరోవైపు హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌’ ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని హసీనా సహా పలువురిపై తాత్కాలిక ప్రభుత్వం కేసుల్ని నమోదు చేసింది. వీటి విచారణ కోసం ఆమెను రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ‘హసీనా సహా పరారీలో ఉన్న వారందరికీ అరెస్టు వారెంట్‌ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింతపై ఒప్పందం ఉంది’ అని ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తాజుల్‌ ఇస్లామ్‌ చెప్పారు.

bottom of page