top of page
MediaFx

అంత‌ర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ‌లో స్పోర్ట్స్ పాల‌సీ తీసుకొస్తామ‌ని, కందుకూరు మండ‌ల ప‌రిధిలోని బేగ‌రికంచ‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. పిల్ల‌ల‌ను పుస్త‌కాల‌కు ప‌రిమితం చేసి క్రీడ‌ల‌కు దూరం చేస్తున్నార‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి స్పోర్ట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆలోచ‌న చేస్తూ వివిధ సంద‌ర్భాల్లో నేను ప్ర‌స్తావించాను. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో గ‌చ్చిబౌలి స్టేడియంలో వివిధ ర‌కాల క్రీడ‌లు నిర్వ‌హించాం. వివిధ కార‌ణాల చేత గేమ్స్ నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయి. పుల్లెల గోపీచంద్ అకాడ‌మీకి ల్యాండ్ ఇచ్చాం. ఆ అకాడ‌మీ నుంచి చాలా మంది క్రీడాక‌రులు త‌యార‌య్యారు. ప్రయివేటు అకాడ‌మీలు కాకుండా ప్ర‌భుత్వం త‌ర‌పున శిక్ష‌ణ ఇస్తే అద్భుతంగా రాణించ‌డానికి అవ‌కాశం ఉంటుంది.. అందుకే ప్ర‌త్యేకంగా ఈ బ‌డ్జెట్‌లో స్పోర్ట్స్ కోసం రూ. 361 కోట్లు కేటాయించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

పిల్ల‌ల‌ను క్రీడ‌ల‌కు దూరం చేస్తున్నారు..

పిల్ల‌ల‌ను పెద్ద పెద్ద చ‌ద‌వులు చ‌దివించాల‌నే ఉద్దేశంతో త‌ల్లిదండ్రులు వారిని పుస్త‌కాల‌కే ప‌రిమితం చేసి క్రీడ‌ల‌కు దూరం చేస్తున్నారు. ఆట‌ల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వ‌స్తాయి.. ఉపాధి దొరుకుతుంది.. ఆ కుటుంబానికి గౌర‌వం కూడా ల‌భిస్తుంది. ఈ విష‌యం ప్ర‌పంచానికి తెలియ‌జేసేందుకే నిఖ‌త్ జ‌రీన్‌కు, సిరాజ్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించాం. ఇండ్లు క‌ట్టుకునేందుకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 600 గ‌జాల చొప్పున స్థ‌లం కేటాయించాం అని సీఎం పేర్కొన్నారు.

విద్యార్హ‌త లేకున్నా సిరాజ్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చాం..

చ‌ద‌వు కంటే కూడా క్రీడ‌ల్లో రాణిస్తే త‌ప్ప‌కుండా ఉద్యోగ భ‌ద్ర‌త ఉంటుంది. ఇంట‌ర్ పాసైన సిరాజ్‌కు విద్యార్హ‌తలో మిన‌హాయింపు ఇచ్చి ఉద్యోగం ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాల‌సీని తీసుకొస్తాం. వివిధ రాష్ట్రాల్లో స్ట‌డీ చేసి స‌మాచారం సేక‌రించాం. హ‌ర్యానా రాష్ట్రంలో క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడ‌ల్లో రాణించిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. కాబ‌ట్టి హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల‌ను అనుస‌రించాల‌ని నిర్ణయించాం. వ‌చ్చే స‌మావేశాల్లో స్పోర్ట్స్ పాల‌సీని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాం అని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ఒక మినీ స్పోర్ట్స్ స్టేడియం

ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ఒక మినీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మిస్తాం. రాష్ట్రంలో అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో మాట్లాడుతున్నాం.. ప్రాథ‌మిక చ‌ర్య‌లు పూర్త‌య్యాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ప్రాంతానికి న్యాక్‌ను షిప్టు చేస్తాం. బేగ‌రికంచెలో అంత‌ర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియంను నిర్మించ‌డానికి భూమి కేటాయిస్తాం. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ వారు ముందుకు వ‌చ్చారు. ఈ స్పోర్ట్స్ విష‌యంలో నిధుల కేటాయింపుతో పాటు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాం. ఈ రాష్ట్రంలో యువ‌త‌ను వ్య‌స‌నాల నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌లంటే స్పోర్ట్స్‌ను ప్రోత్స‌హించాలి. స్పోర్ట్స్ పాల‌సీకి సంబంధించి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తే స్వీక‌రిస్తాం. కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి, స‌రూర్ న‌గ‌ర్, ఎల్‌బీ స్టేడియంలు రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తున్నారు. ప్ర‌పంచంలో మ‌న పిల్ల‌లు ప‌త‌కాలు సాధించే విధంగా శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

bottom of page