top of page
MediaFx

దాడి తర్వాత తొలిసారిగా జనంలోకి..


ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వెంట్రుకవాసి తేడాతో ప్రాణాలతో బయటపడ్డా.. కాస్త అటుఇటు ఐనా ప్రాణాలు పోయేవి అంటూ తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తుచేసుకున్నారు ట్రంప్‌. దేవుడు తన వైపు ఉన్నాడు. లేదంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో అంటూ భావోద్వేగానికి గురయ్యారు డొనాల్డ్‌ ట్రంప్‌. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి లాంఛనంగా అంగీకారం తెలిపేందుకు మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్ మాట్లాడుతున్నంత సేపు రిపబ్లికన్ పార్టీ శ్రేణులు కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణాన్ని మార్మోగించాయి. పెన్సిల్వేనియాలో హత్యాయత్నం ఘటనలో బాధితుల కోసం పార్టీ 6.3 మిలియన్ డాలర్లు సేకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో ట్రంప్‌ మద్దతుదారుడైన కోరీ కాంపెరేటోర్‌ అనే వ్యక్తి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఈ విరాళాలను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

డొనాల్డ్ ట్రంప్‌నకు సంఘీభావంగా ఆయన సపోర్టర్లు చెవికి బ్యాండేజీ కట్టుకుని కొత్త ట్రెండ్ కు తెరతీశారు. కాల్పుల్లో ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆ గాయానికి ట్రంప్ బ్యాండేజీ పెట్టుకుని మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ రాసుకెళ్లింది. చెవికి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో కొద్దిరోజుల పాటు కుడి చెవికి బ్యాండేజీ కట్టుకున్నారు. దీనికి సింబాలిక్‌గా ఆయన అభిమానులు సైత తాము కూడా కుడి చెవికి ఫేక్ బ్యాండేజీ కట్టుకుని రిపబ్లికన్ల జాతీయ స్థాయి కన్వెన్షన్‌కు హాజరవడం ఆసక్తికరంగా కనిపించింది. కాగా, ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తి థామస్ మాథ్యూస్ క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ అక్కడికక్కడే చంపింది. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. రిస్క్ తీసుకుని తన ప్రాణాలను కాపాడిన ఏజెంట్లను అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించారు.

bottom of page