సల్మాన్ ఖాన్ బ్యూటీగా జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బోల్డ్ బ్యూటీగా, హాట్ నటిగా జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ అండ్ డిమాండ్ ఉంటుంది. సల్మాన్‌తో కిక్, రాధే అంటూ జోడి కట్టి బాాగానే పాపులర్ అయింది. ఇక ఈ భామ తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితురాలే. ప్రభాస్ సాహో సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అయితే ఈ శ్రీలంక భామ ఇప్పుడు పూర్తిగా ఓ తెలుగు సినిమా, తెలుగు దర్శకుడితో పని చేసేందుకు టైం వచ్చినట్టుగా అనిపిస్తోంది.
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా జయశంకర్‌కు వచ్చిన పేరు అందరికీ తెలిసిందే. తొలి ప్రయత్నమే అయినా అంత ఎమోషనల్‌గా, అంత కన్విన్సింగ్‌గా ప్రేమ కథను చెప్పిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. సంతోష్ శోభన్‌కు పేపర్ బాయ్ ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడిగా భీమ్స్‌కి సైతం మంచి పేరు వచ్చింది. అలాంటి ఓ సున్నితమైన కథను చక్కగా హ్యాండిల్ చేసిన జయశంకర్ ప్రస్తుతం ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాడు.
జయశంకర్ అరిషడ్వర్గాల కాన్సెప్ట్ మీద తీసిన అరి మూవీ అన్ని విఘ్నాలను దాటుకుని జూన్‌లో వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అరి మూవీని యండమూరి, వెంకయ్యనాయుడు వంటి మహామహులు వీక్షించి మెచ్చుకున్నారు. ఎన్నికల హడావిడి తగ్గిన తరువాత ఈ చిత్రం థియేటర్లోకి వస్తుందని సమాచారం. ఈ విషయం అలా ఉంచితే.. జయశంకర్ మూడో ప్రాజెక్ట్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
జయశంకర్ ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని, అందులో నయనతారను హీరోయిన్‌గా అనుకుంటున్నారనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లోకి జాక్వెలిన్‌ను తీసుకుందామని, ఆమె అయితే సౌత్, నార్త్‌లో ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతల ఆలోచన అని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.