top of page
MediaFx

పూరి జగన్నాథ రథయాత్ర ముగిసిన తర్వాత ఏమి చేస్తారో తెలుసా..

ఒడిశాలో ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మహాయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. జగన్నాథుని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ఒక మత విశ్వాసం ఉంది. అయితే ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ రథాలు, వాటి కర్రలకు ఏమి చేస్తారు? ఈ రోజు తెలుసుకుందాం!

జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. జగన్నాథుడుని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి మూడు వేర్వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళ్తాడు. ప్రతి సంవత్సరం అన్నదమ్ముల సోదరి కోసం కొత్త రథాలు తయారు చేస్తారు.

జగన్నాథ యాత్ర రథాలు

భగవాన్ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథాలు వేప, హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు. ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది. వీరి పని ఆరోగ్యకరమైన, పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం. విశేషమేమిటంటే రథం తయారీలో గోళ్లు, మేకులు లేదా మరే ఇతర లోహాన్ని ఉపయోగించరు. ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను నిర్మిస్తారు. వీరు ఎటువంటి ఆధునిక యంత్రాన్ని ఉపయోగించరు. వీరిలో చాలా మందికి అధికారిక శిక్షణ కూడా లేదు. ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన, ఎత్తైన, బలమైన రథాలను తయారు చేస్తారు.

రథయాత్ర పూర్తయిన తర్వాత రథాలు

రథయాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలు వేరు చేస్తారు. నివేదికల ప్రకారం, రథంలో ఎక్కువ భాగం వేలం వేయబడుతుంది. దీని భాగాల వివరాలు శ్రీజగన్నాథ వెబ్‌సైట్‌లో ఇస్తారు. రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం, దీని ప్రారంభ ధర రూ.50 వేలు. రథం భాగాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించినా వాటిని ఉపయోగించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఆలయ నోటిఫికేషన్ ప్రకారం చక్రాలు, ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలుదారుడి బాధ్యత.

వేలంలో మాత్రమే కాదు.. రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు. అక్కడ దేవతలకు ప్రసాదం వండడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులకు అందజేస్తారు. పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం కిచెన్ మెగా కిచెన్. భగవంతునికి సమర్పించేందుకు ఇక్కడ రోజూ 56 రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. నేటికీ ఈ ఆహారమంతా మట్టి కుండల్లోనే తయారు చేస్తారు.

bottom of page