లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల్లో అంతర్గ కమ్ములాటలు పెరుగుతున్నాయి. కాకినాడ జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. జనసేన నేతలు రెండు గ్రూపులుగా విడిపోవడం రచ్చకు దారి తీసింది.
కాకినాడ సిటీ జనసేన నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి.. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటల యుద్ధానికి దిగారు. మీటింగ్‌లోనే కాదు.. రోడ్డుపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. కష్టం ఒకరిది.. క్రెడిట్ మరొకరిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్.. కాకినాడ సిటీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి.. జనసేన నేతలు, కార్యకర్తలతోపాటు.. టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. అయితే.. స్టేజీపైకి తమ నాయకుడిని పిలవకుండా అవమానించారంటూ.. జనసేన పార్టీలోని ఒక వర్గం ఆందోళనకు దిగింది. కష్టపడినవారిని గుర్తించకపోగా, అవమానిస్తారా అంటూ కార్యకర్తలు ఊగిపోయారు. స్టేజీ దగ్గరకు వెళ్లి మరీ ఆందోళన చేపట్టారు. ఒక వర్గంపై మరొక వర్గం నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దాంతో.. జనసేన ఆత్మీయ సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో సమావేశ ప్రాంగణమంతా కాసేపు అట్టుడికింది. ఇక జనసేన పార్టీ వర్గవిభేదాలతో సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనలో వర్గవిభేదాలు భగ్గుమనడం పార్టీని ఆందోళన కలిగిస్తోంది. కూటమి నేతలతో కలిసి విజయం కోసం పోరాడాలని పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటీకి… సొంత పార్టీ నేతలే ఇలా గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది.