భారత దేశ తొలి ప్రధాని ఎవరు అంటే ఏం చెప్తారు. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలి వరకు జవహర్ లాల్ నెహ్రూ అని చెబుతారు. అయితే బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ మాత్రం జవహర్ లాల్ నెహ్రూ కాదు.. మన దేశ మొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు.
ఇటీవలె బీజేపీలో చేరినట్లు ప్రకటించిన కంగనా రనౌత్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు నుంచే రాజకీయాలు, రాజకీయ నేతలపై చేసే వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ డోసు మరింత పెంచారు. ఇక తాజాగా దేశ తొలి ప్రధాని గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలోనే కాకుండా ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
తాజాగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా రనౌత్.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లారు అని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్‌ను భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్.. కంగనా చేసిన వ్యాఖ్యలను సరిచేయడం గమనార్హం. అయితే నేతాజీకి చెందిన ఆజాద్ హింద్ ఫౌండేషన్.. ముందుగానే స్వాతంత్య్రం ప్రకటించుకుని.. సుభాష్ చంద్రబోస్‌ను ప్రధానిగా సొంతగా ప్రకటించింది . ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.