ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానంలో భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,696 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పటివరకు కంగనాకు 5,25,691 ఓట్లు లభించాయి. ఈ సందర్భంగా కంగనా సోషల్ మీడియాలో స్పందిస్తూ, మండి ప్రజలతో కలిసి ఒక పోస్టు చేశారు. ‘మండిలోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధాని మోదీ, బీజేపీపై ఉంచిన విశ్వాసానికి ఇదే విజయమని తెలిపారు. నటి కంగనా రనౌత్ విజయం పట్ల అనేక మంది సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. నటుడు అనుపమ్ ఖేర్ ‘నువ్వొక రాక్‌స్టార్. నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. నీకు, మండి ప్రజలకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. KRK కూడా కంగనాను అభినందిస్తూ, ఆమెను సమాచార, ప్రసార శాఖ మంత్రిగా చూడాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే కంగనా విజయం దాదాపు ఖరారైపోయింది. ఈ సందర్భంగా ఆమె తల్లి ఆశీస్సులు తీసుకుంటున్న వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. తల్లి కంగనాకు పెరుగు – పంచదార తినిపించి ఆశీస్సులు అందించడం కనిపిస్తుంది.