కన్నడ హీరో ఉపేంద్ర గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. చిత్ర విచిత్రమైన సినిమాలతో మరియు మూవీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించారు ఉపేంద్ర. కన్నడ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు ఉపేంద్ర. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉపేంద్రకు సినీరంగంలోని దాదాపు అన్ని విభాగాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంది. కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగానూ రాణించారు ఉపేంద్ర. కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన "కన్యాదానం" అనే సినిమాతో పరిచయం అయ్యారు.
ఆతర్వాత ఆయన నటించిన సినిమాలు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదలయ్యాయి. చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఉపేంద్ర.. అల్లు అర్జున్ హీరోగా నటించిన "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఉపేంద్ర. ఇది ఇలా ఉంటే ఉపేంద్ర ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఉపేంద్ర మాట్లాడుతూ.. "నేను ఏమి లేకుండా వచ్చాను. అదే నాకు ప్లస్ పాయింట్. జీరో నుంచి మొదలు పెట్టాను. పోగొట్టుకోవడానికి ఏమి లేదు. వస్తే అదే గొప్ప. అది చాలా అదృష్టం. ఒకసారి నేను ఒక సినిమాకు షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ భోజనం పెడుతున్నారు. నేను కూడా ప్లేట్ పట్టుకొని వెళ్లాను. ఆ ప్రొడక్షన్ బాయ్ భోజనం లేదు పోరా అని తరిమేశారు. ఆతర్వాత నేను హీరోగా చేస్తున్న సినిమాకు అదే ప్రొడక్షన్ బాయ్ పని చేశాడు. కానీ నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది అందుకే అతను అలా మాట్లాడాడు. ఇప్పుడు నేను అది గుర్తుపెట్టుకొని అతన్ని అప్పుడు అలా చేశావ్ కదా అని చెప్పడం అర్థం లేదు" అన్నారు ఉపేంద్ర. ఈ వీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.