top of page
MediaFx

కేసీఆర్‌ డైలాగ్..పూరీ జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు


కేసీఆర్ డైలాగ్ వాడటం ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను వివాదంలో పడేసింది. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మార్ ముంత చోడ్ చింత’ అనే ఐటెమ్ సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో ఓ చోట ‘ఏం చేద్దామంటావ్ మరి’ అనే కేసీఆర్ డైలాగ్‌ని యథాతథంగా వాడేశారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మందేసి అమ్మాయితో చిందేసే ఐటెం పాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొంతును వాడుకోవడం ఆయణ్ని అవమానించడమేనని మండిపడుతున్నారు. ఆ పాట నుంచి కేసీఆర్ డైలాగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మోతె రాజు, ఉప్పరి విజయ్, రాజు అక్కి, చిన్నిగాల వినయ్, రాకేష్ తదితరులు ‘డబుల్ ఇస్మార్ట్’ యూనిట్‌పై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ను అవమానించిన చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఐటెం సాంగ్‌లో వాడుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bottom of page