top of page
Suresh D

స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం..


చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. నెలల చిన్నారి నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. అవసరానికి కంటే ఎక్కువగా కాలక్షేపానికే ఫోన్‌ ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయతే ఈ కాలక్షేపం కాస్త కొందరిలో వ్యసనంగా మారుతోంది. మరీముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడం, గేమ్స్‌, సోషల్‌ మీడియా కారణంగా చాలా మంది గంటలతరబడి ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌ అతి వినియోగం వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని పరిశోధకులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్‌ కారణంగా కంటి సమస్యలు మొదలు మానసిక సంబంధిత సమస్యల వరకు వెంటాడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ను అధికంగా ఉపయోగిస్తున్న చిన్నారులు పాఠశాలలకు గైర్హాజరయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. 😕 ముఖ్యంగా తగినంత నిద్ర, వ్యాయామం, తినడం లేకుండా గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్‌లతో గడిపే చిన్నారులు స్కూళ్లకు ఎగ్గొడుతున్నారని పరిశోధనల్లో తేలింది. ఈ వివరాలను ‘ఆర్కైవ్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఇన్‌ చైల్డ్‌హుడ్‌’ జర్నల్‌లో ప్రచురించారు. 😊📱


bottom of page