మలయాళ హిట్ సినిమా 'నాయట్టు' స్ఫూర్తితో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. శ్రీకాంత్, వరలక్ష్మి, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించారు.🎞️🎥
ప్రభుత్వం, అధికారం తమ చేతిలో ఉందని కొందరు వ్యక్తులు వ్యవస్థలను ఎలా శాసిస్తున్నారు? - ఈ తరహా కథాంశాలు ప్రేక్షకులకు కొత్త కాదు. కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. అయితే... వ్యవస్థలోని వ్యక్తులే బలిపశువు అయితే? వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? అనేది 'కోట బొమ్మాళి పీఎస్' / 'నాయట్టు' కథ.
'కోట బొమ్మాళి పీఎస్'లో బ్యూటీ ఏంటంటే... సహజత్వానికి దగ్గరగా, హై టెక్నికల్ వేల్యూస్ మిస్ కాకుండా తీయడం! సినిమా ప్రారంభమైన కాసేపటికి శ్రీకాకుళం ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళతారు. ఓ మలయాళ సినిమా రీమేక్ చూస్తున్న ఫీలింగ్ ఉండదు. యాస, భాష దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు దర్శక - రచయితలు తీసుకున్న జాగ్రత్తల కారణంగా కొత్త సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. 'నాయట్టు' చూసిన వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ ఉండటం సహజమే. అయితే... ఆ సినిమా చూడని మెజారిటీ ప్రేక్షకులకు 'కోట బొమ్మాళి' నచ్చుతుంది.
రాజకీయ నేపథ్యం ఉన్న 'జోహార్' తీసిన అనుభవం దర్శకుడు తేజా మార్నికి ఉంది. 'కోట బొమ్మాళి పీఎస్'లో పొలిటికల్ సీన్లుచక్కగా డీల్ చేశారు. రాజకీయ నాయకులను చూపించే విషయంలో గీత దాటలేదు. ఫస్టాఫ్ రేసీగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ మూమెంట్స్ కూడా రావడంలో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. కథ నుంచి బయటకు వెళ్లకుండా తీయడంతో కొన్ని ఎమోషన్స్ రెగ్యులర్‌గా అనిపిస్తాయి. అయితే... క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మాత్రం మైంటైన్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని చూసే థ్రిల్లర్ ఇది. పాటలు కథకు అడ్డు తగల్లేదు. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బావున్నాయి.
సినిమా అంతా ఒక ఎత్తు... 'కోట బొమ్మాళి పీఎస్' పతాక సన్నివేశాల్లో మన వ్యవస్థ గురించి మురళీ శర్మ చెప్పే డైలాగులు మరో ఎత్తు. ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నాగేంద్ర కాశి సింపుల్, ఎఫెక్టివ్ డైలాగ్స్ రాశారు.
నటీనటులు ఎలా చేశారంటే: శ్రీకాంత్ నటనను ఆవిష్కరించే పాత్రలు ఇటీవల కాలంలో ఆయనకు అరుదుగా లభిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. అయితే... కథకు ఆ క్యారెక్టర్లు అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్నాయి. ఈ తరుణంలో 'కోట బొమ్మాళి పీఎస్'లో రామకృష్ణ రోల్ మరోసారి శ్రీకాంత్ నటనను ఆవిష్కరించింది. 'ఖడ్గం' తరహాలో ఆయనకు మరో మెమరబుల్ రోల్ అవుతుంది.
సినిమా ప్రారంభంలో రామకృష్ణ క్యారెక్టర్ చూస్తే... ఓ సాధారణ కానిస్టేబుల్ టైపులో ఉంటుంది. ఆయన కూడా సహజంగా నటించారు. కథ ముందుకు వెళ్లే కొలదీ హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు బావుంది. అలాగే, ఆయన నటన! ఓ తండ్రిగా పతాక సన్నివేశాల్లో కుమార్తె గురించి చెప్పే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. ఈ కథకు అసలైన హీరో శ్రీకాంత్. యాంటీ హీరో వరలక్ష్మీ శరత్ కుమార్. ఎందుకంటే ఆమెను విలన్ అనలేం! ఓ విధమైన నవ్వు, బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేస్తూ కథపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించారు. 'కోట బొమ్మాళి పీఎస్' ఓ స్లో పాయిజన్. సాదాసీదాగా మొదలై, కాసేపటికి తన ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళుతుంది. తెరపై ఏం జరుగుతుంది? అని ఆలోచింపజేసే గ్రిప్పింగ్ థ్రిల్లర్. రెండు గంటలు మనల్ని మనం మర్చిపోతాం. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అంతలా కట్టి పడేస్తుంది. సహజత్వానికి దగ్గరగా తీసిన చిత్రమిది. నోటు తీసుకుని ఓటు వేసే ప్రజల్ని, వ్యవస్థను ఎత్తిచూపుతూ మురళీ శర్మ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. కంటెంట్ బేస్డ్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులు అసలు మిస్ అవ్వకండి.