top of page
Suresh D

కృష్ణాబోర్డు సమావేశంలో కీలక నిర్ణయం..

నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణ 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

వాస్తవానికి 14 టీఎంసీలు కావాలని ఏపీ, 10 టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్‌ చేశాయి. కానీ, వారి డిమాండ్లను తిరస్కరించిన కమిటీ.. కుదరదని తేల్చిచెప్పింది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. రెండు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌ల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలను గతేడాది అక్టోబరులో జరిగిన బోర్డు సమావేశంలో కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. 

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. సాగర్‌ నుంచి గరిష్ఠంగా నీటిని తోడుకునే స్థాయి (ఎండీడీఎల్‌) 510 అడుగులు కాగా, 500 అడుగుల నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. ‘ప్రస్తుతం సాగర్‌లో 510.53 అడుగుల వద్ద 132.86 టీఎంసీలు ఉన్నాయి. 500 అడుగులకుపైన 17.55 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.. మే నెల వరకు తెలుగు రాష్ట్రాల అవసరాలకు 14 టీఎంసీలను వినియోగించుకోవాలి. మిగతా 3.55 టీఎంసీలను భవిష్యత్‌ అవసరాలకు మినహాయించాలి’ అని బోర్దు నిర్దేశించింది.


bottom of page