ఆర్ధిక మాంద్యం వస్తుందన్న వార్తల నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారీగా ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందోనన్న భయంతో ఉన్నారు అందరూ.
ఇక పెద్ద కంపెనీల పరిస్థితి ఇలానే ఉంటే చిన్న స్టార్టప్‌ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టప్ కంపెనీలు సైతం ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే స్టార్టప్ కంపెనీలు 10 వేల మందిని ఉద్యోగం నుండి తొలగించాయి. అయితే ఇది గత ఏడాది కంటే తక్కువ కావడం గమనార్హం.
2023లో జనవరి నుండి జూన్ వరకు 21 వేల మంది ఉద్యోగులను తొలగించారని లాంగ్ హౌస్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక తెలిపింది. స్విగ్గీ, ఓలా, కల్ట్ ఫిట్, లిసియస్, ప్రిస్టిన్ కేర్, బైజూ వంటి కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని రోజులు ఈ ఉద్యోగాల తొలగింపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో మరో 5 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తొలగించిన ఉద్యోగాల్లో 15-20 శాతం ఉద్యోగాలను మాత్రమే తిరిగి భర్తీ చేస్తుండటం గమనార్హం.