ఓ వైపు హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ తో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజు రోజుకీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది.
దీంతో వ్యవహారం యుద్ధం దాకా చేరింది. ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. కాగా, ఇజ్రాయెల్ పై లెబనాన్ దాడి చేసిందనే వార్తలు వెలువడ్డాయి. లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రాకెట్లను గగనతలంలో ధ్వంసం చేసింది.దాడి గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మాట్లాడుతూ.. రాకెట్ దాడికి కొద్దిసేపటి ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లో హెచ్చరిక సైరన్‌లు మ్రోగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగింది. లెబనీస్ భూభాగం నుంచి వస్తున్న సుమారు 40 లాంచీలను గుర్తించామని వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని IDF తెలిపింది. కొన్ని రాకెట్లు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు నివేదికలు అందలేదని వెల్లడించింది.🇮🇱🚀