top of page
MediaFx

చేరేదెవరు..? దారులన్నీ తుక్కుగూడ వైపే..

రంగారెడ్డి జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్‌. తుక్కుగూడలో ఇవాళ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా హాజరుకానున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో స్పీడ్‌మీదున్న టీకాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికలకు మరింత జోరుగా సన్నద్ధం అవుతోంది. తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఇక్కడ్నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి ఘనవిజయం సాధించింది కాంగ్రెస్‌. అప్పుడు ఎక్కడ్నుంచి ఎన్నికల శంఖారావం పూరించిందో… ఇప్పుడు అదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్‌.

AICC చీఫ్‌ ఖర్గేతోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరవుతుండటంతో తుక్కుగూడ సభపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. 10లక్షల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచించింది టీకాంగ్రెస్‌. తెలంగాణవ్యాప్తంగా అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌లను పెద్దఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

నిన్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన హస్తం పార్టీ, ఇవాళ తుక్కుగూడ జనజాతర సభలో తెలుగులో మేనిఫెస్టోని ప్రకటించబోతోంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకోబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు. సుమారు 12మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుంటారని చెబుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది అధికార కాంగ్రెస్‌ పార్టీ.. తుక్కుగూడలో సాయంత్రం 5:30 గంటలకు జనజాతర కాంగ్రెస్‌ బహిరంగ సభ ప్రారంభంకానుంది. ఈ వేదికపై రాహుల్‌ గాంధీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించనున్నారు.

తుక్కుగూడ‌లోని 70 ఎక‌రాల విశాల‌మైన మైదానంలో జ‌నజాత‌ర బ‌హిరంగ స‌భ‌ జరగనుంది. వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 550 ఎక‌రాల స్థలాన్ని కేటాయించారు. ఈ స‌భ‌కు ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌ల్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

bottom of page