అమ్మ కోరిక తీర్చడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది అంటున్నారు జాన్వీ కపూర్. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ వదిలేసి.. సౌత్‌లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు. ఆల్రెడీ దేవర సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు సినిమాల్లోనూ జాన్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
అసలు బాలీవుడ్‌లో జాన్వీకి ఛాన్సులు రావట్లేదా లేదంటే సౌత్ కోసమే హిందీని వదిలేస్తున్నారా..? హిందీలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా.. తమిళంలోనూ నటించినా.. ఆమెను మాత్రం తెలుగమ్మాయిలాగే చూసారు మన ప్రేక్షకులు.
అతిలోకసుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది. అందుకే కూతురు జాన్వీ కపూర్‌ను కూడా సౌత్‌లో.. మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ చేయాలనుకున్నారు.. కానీ అది చూడకుండానే వెళ్లిపోయారు.
ధడక్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జాన్వీ కపూర్.. అరడజన్ సినిమాలకు పైగా నటించినా కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని దక్షిణాదిపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు జాన్వీ కపూర్.
ఈ క్రమంలోనే దేవర లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. బాలీవుడ్ పొమ్మంటున్నా.. సౌత్ మాత్రం శ్రీదేవి తనయకు పూలబాట వేస్తుంది.
దేవర సెట్స్‌పై ఉండగానే రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ అందుకున్నారు జాన్వీ. బుచ్చిబాబు సినిమాలో ఈమె నటిస్తుందని కన్ఫర్మ్ చేసారు బోనీ కపూర్.
అలాగే సూర్యతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ పేరు ఖరారైందని తెలిపారు బోనీ. ఇదంతా చూస్తుంటే.. సౌత్‌లో స్టార్ అవ్వడమే కాదు.. అమ్మ కోరిక తీర్చేలాగే కనిపిస్తున్నారు జాన్వీ.