top of page
MediaFx

‘మహారాజ’ మూవీ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు. తెలుగులో మహారాజ సినిమా ఎన్‌విఆర్ సినిమా ద్వారా రిలీజ్ అవుతుంది. మహారాజ సినిమా నేడు జూన్ 14న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

కథ విషయానికొస్తే..మహారాజ(విజయ్ సేతుపతి) భార్య చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతుంటాడు. చిన్నప్పుడు యాక్సిడెంట్ లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్తబుట్ట మాత్రం కూతురు ప్రాణాలు కాపాడటంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. కూతురు స్పోర్ట్స్ క్యాంప్ లో పాల్గొనటానికి వెళ్లిన తర్వాత మహారాజ ఆ చెత్తబుట్ట పోయిందని, తను వచ్చేలోపు ఆ చెత్తబుట్ట దొరికిపెట్టమని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు.

చెత్తబుట్ట పోవటమేంటి అని పోలీసులు తిట్టినా అది దొరికేదాకా అక్కడే ఉంటాను అని, కావాలంటే ఎంతైనా డబ్బులు ఇస్తాను అంటాడు. దీంతో ఆ పోలీసులు అలాంటిదే ఓ డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తుంటారు. మరో పక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) తన ఫ్రెండ్ తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సెల్వంకు, మహారాజాకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్ట దొరికిందా? పోలీసులు ఏం చేసారు? స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్లిన కూతురు తిరిగి వచ్చిందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..ఫస్ట్ హాఫ్ అంతా మహారాజ గురించి, అతని చెత్తబుట్ట కథ గురించి చూపిస్తూ కొంచెం కామెడీని పండించారు. మరో పక్క సెల్వం దొంగతనాలు చూపించారు. ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి పెంచారు. అయితే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండ్ హాఫ్ మొదట్లోనే కథ అర్థమైపోతుంది. ట్విస్టులు రివీల్ చేస్తూ వస్తుండటంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. దీంతో స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా మాములు కథే కదా అనిపిస్తుంది. చివర్లో ఎమోషన్ ని బాగా పండించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. తన 50వ సినిమాకి ఇలాంటి మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడని చెప్పొచ్చు. తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ పాత్రలో కనిపిస్తుంది. సెల్వంగా అనురాగ్ కశ్యప్ మరోసారి తన విలనిజం చూపించాడు. సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పిస్తుంది. మమతా మోహన్ దాస్ స్కూల్ PT టీచర్ గా పర్వాలేదనిపిస్తుంది. తమిళ్ డబ్బింగ్ సినిమా కావడంతో అందరూ తమిళ నటీనటులే ఉన్నారు. మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

సాంకేతిక అంశాలు..ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చాలా ప్లస్. ఒక మాములు కథని సరికొత్త స్క్రీన్ ప్లేతో అద్భుతంగా రాసుకున్నారు. ఆ కొత్త స్క్రీన్ ప్లేతో కథని ఆసక్తిగా నడిపిస్తూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నిర్మాణ పరంగా కూడా సినిమాకి బాగానే ఖర్చు పెట్టారని తెరపై కనిపిస్తుంది.మొత్తంగా మహారాజ సినిమా సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచి మెప్పించిన క్రైం ఎమోషనల్ థ్రిల్లర్.

bottom of page