కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలను నేనే పంపించా: మల్లారెడ్డి సంచలనం
- MediaFx
- May 7, 2024
- 1 min read
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ అసెంబ్లీ పరిధిలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ చెప్పానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు హస్తం పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్పొరేటర్లకు తాను సూచించానని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు న్యూబోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.