యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన "యమదొంగ" సినిమాలో నెల్లూరు యాసలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమతా మోహన్ దాస్ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. కెరీర్ బాగా ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడ్డ మమతా కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రుద్రంగి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించిన మమతా, ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి నటించిన "మహారాజా" సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్ 14న విడుదల కానుంది.
"మహారాజా" ప్రమోషన్లలో పాల్గొంటున్న మమతా, తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, "మలయాళీ చిత్రపరిశ్రమలో నాకు వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను పోషించిన పాత్రలకు ప్రశంసలు వచ్చాయి. అందువల్లే తమిళం, తెలుగు భాషల్లో మూవీస్ చేసే అవకాశం వచ్చింది. మలయాళీ ప్రేక్షకులు నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ వంటి వారు నాపై ప్రశంసలు కురిపించారు" అని అన్నారు.
డేటింగ్ రూమర్స్ పై మాట్లాడుతూ, "గతంలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ మా రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. జీవితంలో రిలేషన్ ఉండాలి. దానివల్ల వచ్చే ఒత్తిడిని మాత్రం నేను కోరుకోవడం లేదు. ఒకరి తోడు కచ్చితంగా కావాలని మాత్రం అనుకోవడం లేదు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం పార్ట్ నర్ కోసం వెతుకుతున్నా.. కాలంతోపాటు అన్ని విషయాలు బయటపడాల్సిందే" అని చెప్పారు.