గత కొంతకాలంగా మ్యాన్ వర్సెస్ మెషీన్ అనే అంశం బాగా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలెజెన్స్ రాకతో ఈ ఇక్వేషన్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనిషి స్థానాన్ని యంత్రాలు ఆక్రమించేస్తాయని చాలా కాలంగా కొన్ని వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
తాజా అధ్యయనం చిన్నారులపై చేసిన ఈ ఆందోళన స్థాయిలను మరింత పెంచేస్తోంది. ఈ అధ్యయనంలో పిల్లలు తమకు సలహాలు ఇవ్వడానికి, తమతో మాట్లాడటానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి మనుషులకన్నా రోబోలే మేలని విశ్వసిస్తున్నారు. కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
118 మంది 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలపై ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
అధ్యయనం పద్ధతులు
ఈ అధ్యయనంలో పిల్లలను వివిధ సమూహాలుగా విభజించారు. వారికి మానవులు, రోబోట్‌లు విడివిడిగా వివిధ వస్తువుల గురించి వివరించే వీడియోలను చూపించారు. ఆ వస్తువుల్లో కొన్ని పిల్లలు గుర్తించదగినవి ఉన్నాయి. మరికొన్ని కొత్తగా ఉండే ఇతర వస్తువులను చూపించారు.
ఉదాహరణకు, బ్రష్‌ను ప్లేట్‌గా పిలిచి, తెలిసిన వస్తువులను తప్పుగా గుర్తించడం ద్వారా మానవులు, రోబోట్‌ల విశ్వసనీయతను పిల్లలు గుర్తించేలా పరిశోధకులు ఓ ప్రదర్శన చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ తప్పును పిల్లలు గుర్తించగలిగారా మనిషి లేదా రోబో చెబుతున్న విషయాన్ని విశ్వసించారా అన్న విషయాన్ని గమనించారు.
ముఖ్యమైన ఫలితాలు
రోబోలపై విశ్వాసం: పిల్లలు రోబోట్‌ల పట్ల పూర్తి ప్రాధాన్యతను చూపారు. అవి చెప్పిన విషయాలను నమ్మడంతో పాటు విశ్వసనీయతను చూపాయి.
తప్పులను క్షమించడం: రోబోలు పొరపాటు చేసినప్పుడు, పిల్లలు దానిని ప్రమాదవశాత్తు జరిగిందని గ్రహించారు. కానీ పెద్దలు తడబడ్డప్పుడు? పిల్లలు ఆ పొరపాట్లు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని భావించారు.
నేర్చుకునే ప్రాధాన్యత: పిల్లలు తమకు నేర్పించేవారిగా, రహస్యాలను పంచుకునేవారిగా రోబోట్‌లను ఎంచుకున్నారు.
భవిష్యత్తు పరిశోధన అవసరం
పిల్లలు రోబోట్‌లను నమ్మదగినవని ఎందుకు భావించారో పరిశోధన అన్వేషించలేదు. ఈ అంశంపై అదనపు అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం చిన్నారులపై AI ప్రభావాన్ని గురించి కొత్త చర్చకు దారితీస్తుంది.