ఇటీవల సౌత్ ఇండియా ఫెస్టివల్ 2024లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో రాజీవ్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు చిరు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. వీరిద్దరు కలిసి ఆ మూవీ సెకండ్ పార్ట్ చేస్తే చూడాలని తన కల అని.. అందుకోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అలాగే యంగ్ హీరో తేజా సజ్జాపై ప్రశంసలు కురిపించారు. తన సినీ ప్రయాణంలో తేజా సజ్జా ఓ భాగమని అన్నారు.
మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తారని రాజీవ్ మసంద్ అడగ్గా.. చిరు మాట్లాడుతూ.. “అక్కడ కూర్చున్న తేజ సజ్జాను చూపిస్తూ.. ఆ కుర్రాడిని చూశారా ?.. అతడు హనుమాన్ సినిమాను చేశాడు. కానీ 25 ఏళ్ల కిందట బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. నాతో సినిమాలు చేశాడు. ఇంద్ర సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అప్పటికీ అతడికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. నన్ను అభిమానించి చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ వాటిని స్పూర్తిగా తీసుకొని ఇప్పుడు హీరో అయ్యాడు. హనుమాన్ సినిమాలో నటించి నిరూపించాడు.
హనుమాన్ పై సినిమా చేయాలని చాలా కాలం క్రితమే అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. అతడు చేసేసాడు. నా ప్రయత్నానికి ముందే నేను సంతృప్తి చెందాను. అతడు కూడా నా ప్రయాణంలో ఒక భాగమే.. నటుడిగా నిరూపించాడు..సినీ పరిశ్రమలోని అందరితో ప్రశంసలు అందుకున్నాడు ” అంటూ తేజా సజ్జాను ఆకాశానికెత్తేశాడు. ఇక చిరు తేజా సజ్జాను పరిచయం చేసిన తీరు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.